Wednesday, February 15, 2012

మానస లీల


                          మానస లీల

రచన: లక్కరాజు శివ రామకృష్ణారావు 

మురహరి రావు గారి అమ్మాయి లీల అంటే నా కెందుకో చాలా ఇష్టం. కోల ముఖం. చక్కని కనుతీరు. ఎర్రగా బుర్రగా ఉంటుంది. నేను ఎప్పుడూ లీలతో మాట్లాడినట్లు గుర్తు లేదు కానీ ఆ అమ్మాయంటే అదొక ఇది. సావిత్రీ గౌరీ దేవి నోములకి మా అమ్మతో నేను వెళ్తే తనూ వాళ్ళమ్మతో వచ్చేది. రోజుకో వంట చేసేవారు - అప్పాలనీ, కలగాయ పులుసనీ. పూర్వకాలంలో వ్రతాలు చేయించి వంటలు నేర్పించే వాళ్లనుకుంటాను. నేను అందుకనే వ్రతాలు చేసుకున్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాను. ఎంచక్కా అప్పాలు, బూరెలు, గారెలు, పరమాణ్ణం తింటూ ఉండచ్చు. ఏమో లీల నాకెందుకో చాలా నచ్చింది. పట్టు పరికిణీ కట్టుకుని పసుపు కాళ్ళతో పేరంటానికి వచ్చేది. ఆ కాలంలో పిల్లలందరం పేరంటానికి అమ్మలతో వెళ్ళేవాళ్ళం. ఒక వారం రోజులు "ఏమన్నా" తినటానికి చలిమిడి, శనగ గుగ్గిళ్ళు, కొబ్బరి ఉండేవి. ఇన్ని పప్పులు తిన్నా మేమెవ్వరం లావు ఎక్కలేదు! బహుశ ఎక్కువ తిరిగే వాళ్ళమేమో అప్పుడు.ఏదో రూపేణా సినిమాలకనో, వేచ్చాలకనో రోజూ తెనాలి నడిచి వెళ్లి వస్తూ ఉండే వాళ్ళం.

ఏమిటో ఆరోజులు తలుచుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. ఆ రోజు లీలా వాళ్ళతో వన భోజనానికి వెళ్దామని పదిగంటలకే గ్లాసు పుచ్చుకుని బయట నుంచున్నాను. "అప్పుడే బయల్దేరా వేరా! ఇప్పుడే గాడి పొయ్యి తీస్తున్నారు" అని బాబాయి అంటే సిగ్గుపడి లోపలికి వెళ్ళాను. నిమిషానికి ఒకసారి ఇంటిలోంచి తొంగి చూస్తూ లీలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో వెళ్ళి లీల ఎదురుకుండా కూర్చున్నాను. ఆ జాకెట్టుతో ఆపరికిణీతో ఎంతో హుందాగా ఉంది! సుతి మెత్తని వేళ్ళతో ముద్దలు కలుపుకుని అలా నోట్లో పెట్టుకుంటూ ఉంటే, అబ్బా నాక్కూడా ఆ చేతులతో ముద్దలు  పెట్టించుకోవాలని అనిపించింది. గాడి పొయ్యి మీద చేసిన గుమ్మడికాయ పులుసూ, వంకాయ కూరా ఎంత బాగున్నాయో! సాయంత్రం పూట స్నానం చేసి చాకలాడు తెచ్చిన బట్టలు వేసుకుని జామ చెట్టెక్కి కూర్చునే వాడిని. కింద లీల ఆడ పిల్లకాయలతో తొక్కుడుబిల్ల ఆడుతూ ఉండేది. నన్ను జామకాయ కోసి ఇమ్మని అడుగుతుందని అనుకునేవాణ్ణి.  ఎప్పుడూ అడగలేదు. 

మనుషులమీద మమకారం పుట్టటానికి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఉండక్కరలేదేమో! ఒకసారి మా ఇంట్లో వాళ్ళందరం "స్వర్గసీమ" సినిమా చూడటానికి తెనాలి వెళ్ళాము. ఎల్లాగూ అందరం ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పి దగ్గరలో ఫోటో స్టూడియో ఉంటే దానిలోకి వెళ్ళాము. ఫోటో తీసే వాడు నల్ల ముసుగులోంచి మమ్మల్ని చూస్తూ మమ్మల్ని సరీగ్గా కూర్చోపెట్టాడు. నాకు బాగా గుర్తు. నేను సైడు ఫోజులో బాగుంటానని చెప్పి, నన్ను చివర నుంచోపెట్టి సైడు ఫోజు ఇప్పించాడు. ఎంతో బాగున్నాను ఆ ఫోటోలో. అందుకని లీల చూస్తుందని లీల వాళ్ళింటి ముందర ఏదో పని కలిపించుకుని సైడు ఫోజులో నడిచే వాణ్ణి. ఇంత చేసినా లీల నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. 

దసరా అప్పుడు పంతుళ్ళతో పప్పు బెల్లాలకి లీలా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు "పంతులికి ఇవ్వాలి ఐదు వరహాలు పిల్లలకి పెట్టాలి పప్పు బెల్లాలు" అని గట్టిగా రాగ యుక్తంగా కూడా పాడాను. చివరికి వేసంకాలం శలవలకి మా తాతయ్యగారి వూరు వెళ్ళబోయే ముందర లీలా వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళాము. లీలని కూర్చోపెట్టి పేరంటం చేసి చిమ్మిరి ఉండలు పెట్టారు. భలే బాగున్నాయి చిమ్మిరి ఉండలు.

ప్రతీ వేసంగి శలవలకీ మా తాతయ్యగారి ఊరు నెప్పల్లి వెళ్తాము. చెరుకు బళ్ళని ఉయ్యూరు పంచదార ఫాక్టరీకి తీసుకుపోతూ, కరణంగారూ చెరుకు, ఫాక్టరీకి తీసుకు వెళ్తున్నామని నాలుగు గడలు ఇంటిముందు పడేసేవాళ్ళు. వేసవిలో తాటి ముంజలు ఎన్ని తినే వాళ్ళమో. మా తాతయ్యతో వెళ్లి ఎంతమందికో అక్షరాభ్యాసం చేశాము. వెళ్ళినప్పుడల్లా పలకా బలపము వచ్చేది. మా తాతయ్యతో మొదట అక్షరాలు దిద్దిన వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తున్నారో !

శలవలయిన తరువాత కఠారం వచ్చాము. మళ్ళా మామూలు పనులు మొదలు. మా పెద్దనాన్నగారు స్కూల్ హెడ్మాస్టారు. మేము పొద్దున్నేలేచి చద్దన్నం తిని స్కూల్ తెరిచి ఫస్టు బెల్ కొట్టేవాళ్ళం. సాయంత్రం చివరి పిరియడ్లో స్కూల్ వెనుక అందరిచేతా ఎక్కాలు వంత పాడించే వాళ్ళం. అందుకనే ఎక్కాలు ఇంకా గుర్తున్నాయి. శలవల్లో బాగమ్మ నాకోసం తేగలు దాచిపెట్టింది - శీనయ్య కొడుకుని కదా నేను. మా నాన్న బాగమ్మ కొడుకూ మంచి స్నేహితులట. పాపం బాగమ్మ కొడుకు మునసబు చచ్చిపోయాడు ! నేనంటే బాగామ్మకు చాలా ఇష్టం. పాతిపెట్టిన తాటి టెంకలు తీసి పగలకొట్టి పెట్టేది. ముంతలో అన్నం తీసి వెల్లుల్లి కారం నెయ్యి కలిపి తినమని ఇచ్చేది. ఎంతబాగుందేదో వెన్నపూస వేసుకు తింటూంటే. మీగడపెరుగు. అబ్బా! ఎందుకో ఎవ్వరికీ చెప్పవద్దనేది. ఈ హడావుడిలో లీల కనపడటల్లేదు అనే సంగతి పట్టించుకోలేదు. ఏదో శలవలకి ఎక్కడికన్నా వెళ్ళినదేమో అని ఊరుకున్నాను. తరువాత చాలా రోజులకి కనపడకపోతే మా అమ్మ నడిగాను. వాళ్ళు తెనాలి వెళ్ళిపోయారుట.

మళ్ళా లీలని చూడలేదు. మాకు ఉద్యోగరీత్యా ఊళ్లుమారటం, దేశాలు తిరగటం తోటి రోజులూ సంవత్సరాలూ గడిచిపోయాయి. రిటైరు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. కొన్ని రోజులు అమ్మతో ఉందామని ఇంటికి వెళ్లాను. పొద్దున్నే లేచి పాల పేకెట్లు తీసుకురావటం ఆ తరవాత మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకురావటం. పేపరు చదివి స్నానం చేసి భోజనం చేయటం. మళ్ళా పేపరు రెండోసారి చదవటం, నిద్రపోయి నాలుగు గంటలకు లేవటం. కాఫీ తాగి షికారు కెళ్ళి సాయంత్రం ఇంటికి చేరటం. పిచ్చా పాటీ తరువాత నిద్ర. ఇదీ వరస రోజూ. 

ఆ రోజు బజారునుండి వచ్చి వరండాలో ఈజీ చైర్ లో కూర్చున్నాను. హాలు లోనుండి మాటలు వినపడుతున్నాయి. నేను వచ్చిన శబ్దం విని అమ్మ "మురహరిరావు గారి అమ్మాయి లీల నన్ను చూడటానికి వచ్చిందిరా" అన్నది. లేచి కిటికీలోనుంచి చూశాను. పెద్ద ఎక్కువగా మారలేదు. అదే కోల ముఖం. అదే వర్చస్సు. 30 ఏళ్ళ సంసారిక బడలికలు మోహంలో కొద్దిగా కనపడుతున్నాయి. తలమీద తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలతో దోబూచులాడు తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళయి ఎవళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారల్లె ఉంది, ఎక్కడలేని తెరిపి మొహంలో కనపడుతోంది. ఒక్కసారి మా కళ్ళు ఏవో మాట్లాడుకున్నాయి. తృప్తిగా లేచి కుర్చీలో కూర్చున్నాను. 

నాకు లీలతో ఏదో మాట్లాడాలని ఉంది. కానీ ఏమి మాట్లాడాలి ? ఎంతో కావాలనుకున్నది హఠాత్తుగా ఎదురు పడితే మాట్లాడటానికి మాటలు రావు. కాఫీ టిఫ్ఫెన్లు అయిన తరువాత ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. కఠారం నుండి వెళ్ళిన తరువాత ఏమి జరిగిందో అంతా విన్నాను. తన పిల్లలు ఏం చేస్తున్నారో విన్నాను. రోజూ తనేం చేస్తోంది చెప్పింది. నా గురించి కూడా అడిగింది. ఇంక మాటలు అయిపోయినట్లున్నాయల్లె ఉంది " వెళ్ళొస్తా నండీ మామ్మ గారూ" అనే మాటలు వినపడ్డాయి.. 

నాకు చెమటలు పోస్తున్నాయి. ఇంకొక్క క్షణంలో లీల నాముందు నుంచి వెళ్తుంది. క్రికెట్ కోర్టులా ఓవల్ షేప్ లో ఉన్న నా బట్టతల, దాద్దామన్నా వీలు లేకుండా బయటకు వస్తున్న బొజ్జ. నెరసిన మీసాలతో దాగని వయసు. నేను ఎదుట పడలేను. లీల గుమ్మం దాటి బయటకు వస్తోంది. హఠాత్తుగా నాకు చిన్నప్పుడు ఫోటోగ్రాఫర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.  వెంటనే సైడ్ ఫోజు పెట్టేశాను, లీల కనుమరుగయ్యేదాకా. మళ్ళా ఎప్పుడు చూస్తానో లీలని.

                                          ---------

ఈ నా చిన్న కథ మార్చ్ 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు (చేతి వ్రాతతో). నా కెందుకో ఈ వేలెంటైన్ డే కి తెలుగులో టైపు చేసి దీన్ని పోస్ట్ చెయ్యాలనిపించింది. 

Thursday, February 9, 2012

నా కంప్యూటర్ బాగయ్యిందోచ్


రచన: లక్కరాజు శివ రామకృష్ణా రావు.

జీవితంలో సుఖానికి అలవాటుపడ్డ ప్రాణానికి అమాంతంగా కష్టాలు వస్తే జీవితం తారుమారు అవుతుంది. రెండువారాల క్రిందట నా డస్క్ టాప్ కంప్యుటర్ పని చెయ్యటం మానేసింది. కొంచెముసేపు పనిచేసి దానంతట అదే ఆగిపోతుంది, ఎందువల్ల పోతున్నానో చెప్పకుండా పోతోంది. రిపైర్ వాడి దగ్గరకు తీసుకు వెళ్ళుదామంటే,  ఇక్కడ అమెరికాలో రిపైర్ వాడు తీసుకునే డబ్బులతో రెండు కొత్త కంప్యూటర్లు కొనుక్కోవచ్చు.

రిటైరు అయ్యి ఒక పద్ధతికి అలవాటయిన జీవికి పద్ధతులు మార్చుకోవటం చాలా కష్టం. ఏమి చెయ్యాలో తోచక కాలుగాలిన పిల్లిలా పైకీ క్రిందకీ తిరుగుతున్నాను. రోజూ కంప్యూటరే లోకంగా చేసుకుని భోజనానికీ కాఫీకీ పిలుపు వస్తే కానీ క్రిందకు వెళ్ళే వాడిని కాను. ఇప్పుడు ఏమి చెయ్యాలో తోచటల్లేదు.

నేను ఊర్కేనే కూర్చున్నానని ఇంట్లో తెలిస్తే నా పని బేజారు అవుతుంది. ఊర్కేనే ఉన్నారుగా నేను పూజ చేసుకుంటున్నాను కొచెం రైసు కుక్కర్ లో అన్నం పడెయ్య కూడదూ. ఫోనులు వస్తే తీసుకోండి. కూర మాడుతోంది కొంచెం స్టవ్ తగ్గించండి. పోనీ హెల్ప్ చేద్దామని చేస్తే, ఎక్కడలేని కోరికలూ పుట్టుకు వస్తాయి. మళ్ళా ఆ కోరికలు కూడా తీర్చాల్సి వస్తుంది. సాయంత్రం ఉల్లిపాయతో వంకాయ కూర చేస్తే బాగుంటుంది (మీరు). రేపు పోద్దునకి సేమ్యా ఉప్మా బాగుంటుంది. మీరు ఆ ఉప్మా చాలా బాగా చేస్తారు. ఇలా హేల్పెర్ గ మొదలుపెట్టినది చివరికి నా పని కేరాఫ్ వంటిల్లు లాగా తయారవుతుంది.

మొన్న ఎదో పాపం కష్ట పడుతోంది కదా అని ఒక వారం కూరలు తరగటానికి వప్పుకున్నాను. ఉల్లిపాయలు చిట్ట  చివ్వరకి తరగండి లేకపోతే ఇల్లంతా వాసన వస్తుంది. కాలీఫ్లవరు సన్నగా తరగవోకండి, చేత్తో మొగ్గలుగా విరవండి. కాబేజీ ఇదుగో ఈ విధంగా సన్నగా తరగాలి.  బ్రోకలి మరీ పెద్ద ముక్కలు చేశారు, పెసరపప్పు వేసి చేస్తాను సరీగ్గా కలవదు. బ్రస్సెల్ స్ప్రౌట్స్ కాబేజీ లాగా తరగండి. కంది పప్పు కలిపి కూర చేస్తాను. కుకుంబర్ చెక్కు తీయండి లేకపోతే పులుసులోకి బాగుండదు (ఆవిడకి). దొండకాయలు నిలువుగా తరగండి చక్రాలుగా కాదు. ఆ బానిస బ్రతుకు తలుచుకుంటే వళ్ళు గగుర్పాటు చెందుతుంది. "చెవిలో ఫోను పెట్టుకుని వంట చెయ్య వోకు. ఉప్పూ కారాలు సరీగ్గా పడవు." అని అరవాలనిపిస్తుంది. కానీ నోరు పెగలదు. ఇంక నేను దీనిని గురించి తలుచుకోలేను. గది తలుపులు వేసుకు కూర్చున్నాను. కానీ ఎంతసేపని కూర్చుంటాను? ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంది. 

నాకు కావలసింది వంటగదా, కొత్త కంప్యుటరా అనే సమస్య మీద చాలా ఆలోచించాను. వంటగదికి వెళ్ళటం ఇష్టం లేదు. కొత్త కంప్యుటర్ అయితే గవర్నమెంటు వాళ్ళు నెల నేలా ఇచ్చే భత్యంలో కొంత భాగం ఎగిరిపోతుంది. అన్ని యప్రువల్స్ తీసుకుని బడ్జటులో పెట్టి కంప్యుటర్ కొనుక్కునే సరికి మళ్ళా క్రిస్మస్ వస్తుంది. అసలుకే మోసం రావచ్చు, అసలు అంత అవసరమా అని  రిక్వస్టు డినై  చెయ్యవచ్చు కూడా. ( అదేమీ తిండి పెట్టదు, రోజంతా దాని ఎదురుకుండా కూర్చుంటారు, అనారోగ్యం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కరెంటు వేస్టు, డబ్బుల వేస్టు.) ఏదో మార్గం ఆలోచించాలి.

నేను దీన్ని బాగు చెయ్యలేనా ? అని నా అంతరాత్మ ని ఒక ప్రశ్న వేశాను. సమాధానం వచ్చింది. వరల్డ్ వార్-2 లో మిగిలిపోయిన మాగ్నెట్ తో స్పెక్త్రోమేటర్  తయారు చేసి డాక్టరేట్లు తయ్యారు చేసిన పరిశోధన శాల నుండి వచ్చావు నువ్వు. ఈ ముసలి కంప్యుటర్ ని వదలలేక సంవత్సరాల బట్టీ దానితో ఏదో విధంగా సాగిస్తూనే ఉన్నావు. ఇప్పటికే రెండు మూడు సార్లు హార్డ్ డిస్క్ ని ఫార్మాట్ చేశావు. దాని మెమరీ(RAM) ని కూడా పెంచావు. ధైర్యే సాహసే లక్ష్మి. ఆలోచించు. వెలుగు చూస్తావు. అని అంతర్వాణి  చెప్పింది. 

నాకు ఇంకా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆరోజు జరిగిన సంగతులన్నీ పరిశీలించటం మొదలు పెట్టాను. పొద్దున్నే కాఫీ తాగి పైకొచ్చి ఖుషీగా కంప్యుటర్లో ఈనాడు వార్తలు చూస్తున్నాను. మధ్యలో దానంతట అదే ఆగి పోయింది. ఏమిటా ఇది అని మళ్ళా స్టార్ట్ చేశాను. ఒక నిమిషం తర్వాత మళ్ళా అల్లాగే అయ్యింది. రెండు మూడు సార్లు అల్లాగే చేశాను. రాను రాను విండోస్ వస్తుంటేనే ఆగి పోవటం మొదలయ్యింది. ఆలోచిస్తున్నాను. నేను శాపాలు తాపాలూ నమ్ముతాను. "For every action there is an equal and opposite reaction" అన్న దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. (పెళ్ళి చేసుకున్న తరువాత చాలా సూత్రాలు తెలుస్తాయి, నమ్మకాలు పెరుగుతాయి.)

దిష్టి తగలటం, శాపనార్ధాలు పెట్టటం రియాక్షనుల క్రిందకు వస్తాయి కాబట్టి ఇవ్వాళ ఎప్పుడో ఎక్కడో ఎవరికో నేను వాళ్ళ దృష్టిలో తప్పుగా గ్రహించబడిన యాక్షను చేసి  ఉండాలి. ఏమి చేశానబ్బా ఇవ్వాళ. ఎవర్ని నొప్పించాను? అనే దృష్టి తో ఆలోచించటం మొదలెట్టాను.

ఏమితప్పు చేశాను? ఎవరు నన్ను పొద్దున్నే శపించారు? ఇంట్లో ఉన్నది ఇద్దరమే కాబట్టి దాన్ని కనిపెట్టటం చాలా తేలిక. ఆలోచిస్తే పొద్దున మా ఆవిడ కూరలు తరిగి పెట్టమని అరుస్తూ ఉన్నా, వినపడనట్లు నటిస్తూ కాఫీ తాగి పైకి వచ్చేశాను. అదే అయ్యుంటుంది.  ఆడవాళ్ళ శాపాలు చాలా గట్టివి. వెంటనే నవ్వు ముఖంతో కిందకి వెళ్లి కూరలు తరగనా అన్నాను. మౌనంగా పోపులో వేగుతున్న వంకాయకూర వేపు చూపటం జరిగింది. ఆ చూపులోనే తేలిపోయింది సమాధానం. శాప విముక్తికి ఏమి చెయ్యాలో అర్ధం కావటల్లేదు. కొంతన్నా ఫలితం వస్తుందని  కూర కలపటానికి ప్రయత్నించాను. భీకరమైన మొహం చూసి భయపడ్డాను. ఐ యాం డూమ్డ్. 

ఏం చెయ్యాలి?  కంప్యూటర్ బాగు చెయ్యటం మీద నేను ఇదివరకు వ్రాసిన పోస్ట్ లు గుర్తుకి వచ్చాయి. అన్ని చిట్కాలు   ట్రై చేసాను. ఒక్కటి కూడా ఉపయోగపడలేదు. విండోస్ వస్తుంటే safe mode లోకి వెళ్ళ లేక పోయాను. ఆపరేటింగ్ సిస్టం లేకపోతే  Restore Point కి వెళ్ళటం కుదరదు. విండోస్ కరప్ట్ అయ్యినదనుకుని బేకప్ డిస్క్ తో ప్రయత్నించాను. అసలు ఆపరేటింగ్ సిస్టమే ( విండోస్ xp ) లోడ్ అవటల్లేదు. నా దగ్గర DOS ఫ్లాపీ ఉంటె దానితో ప్రయత్నించాను Format C: చేద్దామని. లోడ్ అవలేదు. అసలు మాటా పలుకు లేకుండా జారుకుంటోంది.

పెళ్ళాల శాపాలు ఇంత గట్టిగా ఉంటాయని తెలిస్తే పొద్దున్నేకూర తరిగి ఇచ్చేసే వాడిని. తప్పొప్పుకుంటే శాపాలు పోతయ్యని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఏదో విధంగా ఈ సమస్య నుండి బయటపడితే ఇకనుండీ పొద్దున్నే పెళ్ళాం చెప్పిన పనులు తప్పకుండా చేస్తానని తలుపు గడియపెట్టి లెంపలేసుకున్నాను. నాకు గిల్టీ కాన్క్షన్సు పోయింది. నా మనస్సు కుదుట పడింది. గమ్మత్తుగా కారు మేఘాలన్నీ తొలగి పోయాయి. జయం మనదే అనే ఫీలింగ్ వచ్చింది. ఇంక ధైర్యంతో ఆలోచించటం మొదలు పెట్టాను.

అసలు విండోస్ రాకుండానే  కంప్యూటర్ ఆఫ్ అవుతోంది. అదికూడా ఒక  వేరు వేరు సమయములలో పోతోంది.  ఒకసారి వెంటనే పోతుంది. ఒకసారి కొంచెం సేపు తరువాత. ఆన్  చెయ్యగానే కంప్యుటర్ చేసే మొట్ట మొదటి పని ఏమిటి? జాగర్తగా ఆలోచిస్తున్నాను.

కంప్యుటర్ కి ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ ) చాలా ముఖ్యం. కంప్యుటర్ లో ఉన్న అన్ని భాగాల్తోటీ కలిసికట్టుగా పని చేయించేది ఇదే. అది మొట్టమొదట హార్డ్ డిస్క్ లోనుండి కంప్యుటర్ RAM లోకి లోడ్ అవుతుంది. RAM లో ఉంటే పనులు వేగంగా జరుగుతాయి కనుక. ఇప్పుడు ఆపని జరగటల్లేదు. అందుకని ప్రాబ్లం ఈ మూడింటిలోనే ఉండి ఉండాలి. హార్డ్ డిస్క్, విండోస్, RAM .

బాకప్ డిస్క్ లో నుండి కొత్త ఆపరేటింగ్ సిస్టం పెడదామంటే తీసుకోవటల్లేదు. బహుశా  RAM రిజెక్ట్ చేస్తోందేమో. కంప్యుటర్ లోకి వెళ్ళేవి అన్నీ RAM ద్వారా నే వెళ్తాయి. RAM సరి లేక పోతే కంప్యుటర్లో ఏ పనీ జరగదు. అందుకని RAM పాడయి ఉంటుందని  తేల్చుకున్నాను. ఇది కాకపోతే సెకండ్ గెస్, లాంగ్ షాట్, హార్డ్ డిస్క్ పాడవ్వచ్చు. నాలుగేళ్ల క్రిందట RAM expand చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. అది పాడయ్యిందేమో!! 

ఎటాక్ ప్లాన్ తయ్యారయ్యింది. కంప్యుటర్ ఓపెన్ చెయ్యటం. కొత్తగా పెట్టిన RAM ని బయటికి తీసి, కంప్యుటర్ తో వచ్చిన RAM తో కంప్యుటర్ ని స్టార్ట్ చెయ్యటం. కంప్యుటర్ పనిచేస్తే RAM ప్రాబ్లం లేక పోతే హార్డ్ డిస్క్ ప్రాబ్లం.

స్క్రూ డ్రయివర్లు తెచ్చుకుని కూర్చున్నాను. స్క్రూలు ఎక్కడా కనపడలేదు. నేను కంప్యుటర్ ఓపెన్ చేసిన కాలంలో స్క్రూ డ్రయివర్ తో ఓపెన్ చేసేవాణ్ణి. ఎన్ని తెలివితేటలు ఉన్నా మెకానికల్ బుర్ర లేకపోతే వృధా. సింకులో  నీళ్ళు పోకపోవటం దగ్గరనుండీ అరమరాల కిట్లు కొని బిగించటం వరకూ మా ఆవిడే చూసుకుంటుంది. ప్రస్తుతం మాటలు లేవు. అడగటానికి కొంచెం సిగ్గూ భయమూ రెండూ అడ్డుకున్నాయి. దానికితోడు ఆవిడకి  కంప్యూటర్ బాగుకి నాకు దోహదం చెయ్యాల్సిన అవుసరం లేదు. ఆవిడ లాప్ టాప్ ఆవిడకుంది. దాన్ని నేను ముట్టుకోనని ఆవిడకి బాగా తెలుసు. వేలుతో కంప్యుటర్ ఆడించటం నాకు చేతకాదు. 

ఆపద్భాన్ధవా  ఏమి చెయ్యాలి? మనము మంచిపనులు చేస్తూ ఉంటె దేముడు ఏదో రూపేణా తప్పకుండా ప్రత్యక్ష మవుతాడు. హటాత్తుగా ఫోన్ మోగింది. మా అబ్బాయి న్యూయార్క్ నుండి వీకెండ్ కి వస్తున్నాడు. RAM expand చేసింది కూడా వాడే. వాడు సర్ప్రైజ్ కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేసి పెట్టాలో వెంటనే చెప్పేశాను. నాలుగు రోజులు కంప్యూటర్ లేక పోతే ఫరవా లేదు ఏదోవిధంగా బిజీగా ఉన్నట్లు నటించగలను. వంగిపోతూ ఎగస్పార్టీకి సాక్షాత్ నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు.

మర్నాడు వీకెండ్ కి,  రెడ్ ఐ ఫ్లయిట్ లో న్యుయోర్క్ నుండి మా వాడు దిగాడు. మొదట పరిష్కరించాల్సిన సమస్య నాదే.  అయిదు నిమిషాల్లో మా అబ్బాయి కంప్యూటర్ ఓపెన్ చేసి RAM బయటికి తీసాడు. డాక్టరేట్ చేసిన వాళ్ళు పనులు చేస్తుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. డస్క్ టాప్ కంప్యుటర్ చాస్సిస్ మీద ఒక లీవర్ ఉంటుంది. అది నొక్కితే పై ప్లేటు వచ్చేస్తుంది. విషయం తెలిస్తే ఎంత సులువు. మీరు కంప్యుటర్ ఓపెన్ చేస్తే వాక్యుం క్లీనర్ పక్కన పెట్టుకోండి. బోలెడంత బూజు, దుమ్మూ ధూళి ఉంటుంది తీసెయ్యండి.  

యురేకా! కంప్యుటర్, కంప్యుటర్ తో వచ్చిన ఒరిజినల్  RAM తో పని చేస్తోంది. బయట గట్టిగా స్నో పడుతోంది. ఆరోజు బయటకు వెళ్ళటానికి కుదరదు. ఇది చికాగో వింటర్. మర్నాడు CompUSA కంప్యుటర్ స్టోర్ కి వెళ్లి ఒక గిగ్ RAM కొనుక్కొచ్చి పెట్టాడు (ఈ కంప్యుటర్ అంతకన్నా తీసుకోదు.). ఖర్చు ముప్పైరెండు  డాలర్లు. రెండువారాలనుండీ టెస్ట్ చేస్తున్నాను. కంప్యుటర్ బాగానే పని చేస్తోంది.

కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం తయారు అయ్యింది. వ్యాక్యుం చేస్తుంటే కంప్యుటర్ లో నుండి రెండు క్లిప్పులు  ఊడి పడ్దాయి. అవి లేకుండానే కంప్యుటర్ నడుస్తోంది కాబట్టి అవి ముఖ్యమయినవి కాక పోవచ్చు అనుకున్నాము. ఇంటర్నెట్ లో వెతికితే అవి హీట్ సింక్ ని అణచి పెట్టి ఉంచే క్లిప్పులని తేలింది. కంప్యుటర్ నిలబెడితే హీట్ సింక్ క్రిందపడుతున్దేమోనని కంప్యుటర్ ని పడుకో బెట్టి పని గడుపు కుంటున్నాను.  

నుంచుని చేస్తే నాకేటి. పడుకుని చేస్తే నాకేటి. పనిచేస్తుంటే నా కిష్టం. 

                                              ---------

Tuesday, April 12, 2011

పరంధామయ్య తో బ్రేక్ ఫస్ట్


                                         రచన:  లక్కరాజు శివరామకృష్ణ రావు.

మాలా కుమార్ గారి పప్పుచారు కాగుతోంది ఒక మూల, ఇంకొకవైపు "పాక వైద్యం" కౌటిల్య గారి మిరియాల చారు మరుగుతోంది,  రైసు కుకర్లో అన్నం పడేసాను. ఇంక కూర చేస్తే సరిపోతుంది. సింపుల్, పోపు వేయటం దానిలో ఫ్రోజెన్ ఫ్రెంచ్ కట్ బీన్స్ వేసి వేయించటం తరువాత కారం ఉప్పు చల్లటం. కూర అయిపోతుంది.

మనము అయిపొయింది అనుకున్నప్పుడే అన్నీఎదురు తిరుగుతాయి. ఇప్పటికి పోపు రెండుసార్లు మాడింది. ఈ మాడిన పోపు తో కూర ఎవరన్నా చూస్తే నా అహం దెబ్బతింటుంది. నాకు వెంటనే రెస్క్యుప్లాన్  కావాలి. "పాక వైద్యం" కౌటిల్య గారి పర్ఫెక్ట్ పోపు పెట్టే విధానం గురించి ఒకప్పుడు చదివినట్టు గుర్తు. వెంటనే లాప్ టాప్ తీసి "పాక వైద్యం" లోకి వెళ్లాను. ఈయనతో ప్రాబ్లం ఏమిటంటే అసలు విషయం పోస్ట్ మధ్యలో ఎక్కడో వ్రాస్తారు. అవసరంగా అప్పటికప్పుడు వెతికే నాలాంటి వాళ్లకి ఎంత కష్టమవుతుంది? కనీసం పోపు చెయ్యు విధానము ఇక్కడ అని పోస్ట్ మధ్యలో బ్లాక్ లెటర్సుతో వేస్తే బాగుంటుంది కదా. ఎల్లాగాయితేనేమి పట్టాను. భగుణ లో నూనె వెయ్యి, దానిలో అవి వెయ్యి ఇవి వెయ్యి, తిరగమాత మాడకుండా "సిం" లో పెట్టి చెయ్యి. చేస్తున్నాను గంటలు పడుతోంది. అది వేగుతుంటే నా మనస్సు లో బాధ పెల్లుబికి వస్తోంది. నేనే తప్పు చేశానేమో. ఇవ్వాళ పర్ఫెక్ట్ స్ప్రింగ్ డే అని ఉత్సాహంగా ఉంటే ఇల్లా అయింది. ఇంక ఆగలేను వినండి. బాధ పంచుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుందట.

ఉదయాన్నే బంగారు ఉదయకిరణాలు కిటికీ లోనుండి వస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్ చేసుకుని క్రింద సోఫా లో కూర్చున్నాను. క్రూరమయిన మూడు నెలల చికాగో చలికాలం తరువాత ఎంతో ఫ్రెష్ గ ఉంది. ఇవ్వాళ IHOP (International House of Pancakes) లో బ్రేక్ ఫస్ట్. వారెవ్వా ఆ పాన్ కేకులు ఎక్కడా దొరకవు. బొద్దుగా మెత్తగా సుతారంగా ఉడికీ ఉడక నట్లు, కాలీ కాలనట్లు, బంగారం రంగుతో, వావ్ తలుచుకుంటేనే నోరూరుతుంది. "హాష్ బ్రౌన్స్"  ఇంక వాటిగురించి చెప్పక్కర్లేదు. పైన కొద్దిగా బ్రౌన్ మధ్య మల్లెపువ్వు లాంటి సుతి మెత్తని తరిగిన పొటాటో రెక్కలు. వాడి కాఫీ ఉంది చూడండి ఇక చెప్పలేము. ఒకప్పుడు కాఫీ అక్కడ తాగాలంటే భయమేసేది. ఇప్పుడు చాలా డిఫరెంట్. మైల్డ్ బోల్డ్ సున్నితమయిన ఫ్రాగ్రన్సు. ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ టేబుల్ మీద పెడతారు. కావాల్సినన్ని సార్లు తాగచ్చు. నేనయితే రెండు కాకపోతే మూడు సార్లు తాగుతాను. కనీసం తినే ముందర తిన్న తరువాత.

నా సంతోషాన్ని నా దగ్గర వాళ్ళతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకనే పరంధామయ్య నీ ఆయన భార్యనీ రమ్మన్నాను. మా ఆవిడ ఎల్లాగూ వస్తుందనుకోండి. నిజం చెప్పొద్దూ అసలు పరంధామయ్య ని పిలవటానికి కారణం నాకూ మా ఆవిడకీ మధ్య బఫ్ఫర్ గ ఉంటాడని. ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి? 

అప్పుడే పది గంటలయింది. ఆవిడ గారు లేచారల్లె ఉంది పైన శబ్ద మవుతోంది. బ్రేక్ ఫస్ట్ టైము పదిన్నరకు అయిపోతుంది. మా రిటైర్మెంట్ అగ్రీమెంట్ ప్రకారము ఎవరూ ఎవరిని తొందర పెట్ట కూడదు. తొందరగా వస్తే వెళ్ళొచ్చు  అని కొంచెం చిగురాశ ఉంటే పరంధామయ్య కి ఫోను చేసాను. ఎవ్వరూ పలకటల్లేదు. నా ఆశలన్నీనీరు కారి పోతున్నాయి. పొద్దుటి నుండీ ఎదురుచూస్తున్న బ్రేక్ ఫస్ట్ కి ఇంతే సంగతులు.

పదకొండున్నరకి పరంధామయ్య దిగాడు వాళ్ళ ఆవిడతోటి. 

"బ్రేక్ ఫస్ట్ కి వస్తానన్నావు?"

"మాస్టారూ క్షమించండి లేటయింది"

"ఉదయం నుండీ ఎదురు చూస్తున్నాను పరం ధామా"

"పొద్దున్నే కూరలకు వెళ్ళాల్సొచ్చింది" "ఆ తరువాత ఆయిల్ ఛేంజి."

"ఇవ్వాళే వెళ్ళాలా నాయనా"

"లేదండి వెళ్ళక తప్పలేదు"

"కొంచెం లేవటం కూడా లేటుగా లేచాము"

"నిన్ననీకు రెండు సార్లు ఫోను చేసాను IHOP కి వెళ్దాము పొద్దున్నే రమ్మని"

" ఫరవాలేదండీ ఎప్పుడయినా  వెళ్ళచ్చుట, నిన్నమేము పిలిచి కనుక్కున్నాము" 
"ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ అక్కడ."

"బ్రేక్ ఫస్ట్ కుక్, లంచ్ కుక్, డిన్నర్ కుక్ వేరు వేరు" అన్నాను నేను.

"కుక్ లందరూ ఒకటే. అయినా మీరు తినే pancakes కి ఏ కుక్ అయితే నేం?" మా ఆవిడ అందుకుంది.

ఇంకా నేను ఆగ లేక పోయాను. "యాభై ఏళ్ళకు పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళ బాలాకుమారి గ ఉండాలంటే కష్టం"

ఎవ్వరికీ అర్ధం కాలా. నేను మాట్లాడేదాన్ని co-relations అంటారు. అందరికీ అర్ధం కావు. విశదీకరించా.
 "పెళ్లి ఏ వయసులోనయినా చేసుకోవచ్చు (అంటే అది ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ లాంటిది). యాభై ఏళ్లకు (అంటే లంచ్ టైము లో) పెళ్లి చేసుకుని ఇరవ్వై ఏళ్ళ వాళ్ళు లాగా ( అంటే బ్రేక్ ఫస్ట్ లాగా) ఆనందించాలంటే కష్టం. బ్రేక్ ఫస్ట్ pancakes వేరు లంచ్ టైం pancakes వేరు." 

అంతా నిశ్శబ్దం. నేను అన్నదానికి రియాక్షన్ ఏమీ కనపడటల్లేదు.
ఇంకా ఏ విధంగా అర్ధమయ్యేటట్లు చెప్పాలో తెలియటల్లా. 

"ఒకపూట వంట తప్పుతుందని ఆమ్మ గారూ నేనూ లంచ్ టైముకి వెల్దామను కున్నాము. ఏ కుక్ అయితే ఏమి, తినేది Pancakes యే కదా అని ఆమ్మ గారు అన్నారు" తనతప్పేమి లేదని పందామయ్య భార్య అసలు విషయం బయట పెట్టింది.

"మీరేవన్నా చెప్పండి  కుక్కులు అందరూ ఒకటే" తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఇదేనేమో.

తెల్లబోయాను. నాకు కోపము ఆగటల్లేదు. తను ఒకటి తలిస్తే దైవము ఒకటి తలుస్తుందిట. కాదు తను ఒకటి తలుస్తే పెళ్ళాలు ఇంకొకటి తలుస్తారుట. ఆడవాళ్ళ గూడుపుఠాణీ తెలిసి పోయింది. ఏదో అనాలని అనిపిస్తోంది.

నా మనస్సు గట్టిగా నోరుమూసుకోరా అని చెప్తూనే ఉంది. ఆగలేక నోరు విప్పాను.
"బార్బరులు అందరూ ఒకటే, రోజూ గుండు చేసే బార్బర్ దగ్గరకి క్రాఫ్ కోసం వెళ్తామా? "  అని నాలిక కరుచుకున్నాను.
"ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ" పాట మనస్సులో మెదుల్తోంది.

అంతే నిశ్శబ్దం. తలుపుతీసిన శబ్దం అయ్యింది. మొదట మా ఆవిడ. తరువాత పరంధామయ్య భార్య ఆ తరువాత ఆవిడ కొంగు పుచ్చుకుని పరంధామయ్య నిష్క్రమించారు. పరంధామయ్య వెళ్తూ నా వంక చూసి బేల మొహం పెట్టాడు. కారు స్టార్ట్ చేసిన చప్పుడయింది. తరువాత కారు వెళ్ళిపోయింది. కఠోరమయిన నిశ్శబ్దం.

ఆకలవుతోంది. మనస్సంతా కటిక చీకటిగా ఉంది. నాకు పెద్దగా అరిచి బల్ల గుద్దాలని ఉంది. కానీ ఫ్యూచర్ భయ పెట్టింది. ఇంక కూర్చుని లాభంలేదు. లేచాను. భయాలతోటి బాధలతోటీ ఫ్యూచర్ ని ఆపలేము. వారం రోజులకు సరిపడా వంట చెయ్యటం మొదలెట్టాలి.

*Pancakes ఒక రకమయిన అట్లు. సామాన్యంగా పోద్దునపూట తింటారు.
*Hash Browns బంగాళా దుంపల ని చాలా సన్నగా తరిగి (Shredding) చేసి ఉడకపెట్టి పెనం మీద వేయిస్తారు.

Friday, October 22, 2010

మీరేమంటారు ?

ముందు మాట: ఆగస్టు 25, 2010 న చికాగో ట్రిబ్యూన్ లో  Ask Amy  అనే కాలమ్ లో అడిగిన ప్రశ్న దానికి సమాధానం తెలుగు లో వ్రాస్తున్నాను. ఇది నన్ను ఆకర్షించడానికి కారణం, అమెరికా లో సాధారణ ప్రజల  మనస్తత్వం ఎటువంటిదో చెబుతుంది. 


డియర్ ఎమీ: ఈ మధ్య నేను temporary job లో పనిచెయ్యటం మొదలెట్టాను. నా కంటే బాగా పెద్ద ఆయన గూడా అక్కడ పనిచేస్తున్నారు. కాకపోతే ఆయనది పర్మేనేంట్  పొజిషను. ఆయన చాలా స్నేహముగా ఉంటారు కాని కొంచం తలతిక్క. ఆయన ఈమధ్య నన్ను ఒక షాప్ కు వెళ్ళి కొన్ని తినే పదార్దములు కొనుక్కు రమ్మన్నారు. దానికి ఆయన డబ్బులిస్తానని చెప్పినారు. అల్లాగే నా మధ్యాహ్నపు భోజనం పంచు కుందామని కూడా అన్నారు. నేను వీటన్నిటికీ వప్పుకుని చేశాను.
క్రిందటి వారము నాలాంటి temporary ఇంకొకళ్ళు ఈయనకి భోజనము తీసుకు వస్తుంటే చూశాను. నా ఉద్దేశం లో ఆయనకి శక్తి లేక షాపు దాకా నడచి వెళ్ళటము కష్టముగా ఉన్నటుల కనిపిస్తోంది. ఆయనకి ఆదుకునే దిక్కు కూడా లేనట్లు ఉన్నది.
ఈ పరిస్థితి నాకు కొంచెము బాధాకరముగా ఉన్నది, ప్రతీ వారం ఆయనకోసం బయటకు వెళ్ళి తీసుకు రావాలంటే నాకు కొంచెము కష్టమవుతుంది. దానికి తోడు ఈ విధముగా ఆయన నామీద ఆధార పడి ఉండటం ఆయన కష్టాలకు శాశ్వత పరిష్కారము కాదు.  


ఆయన రొజూ పనిచెబితే నేను ఏమి చేసేది.  మీరు నాకు ఏమి సలహా ఇస్తారు ?.
మన ఈ సంఘము లో వృద్ధులను సంరక్షించుటలో  మన కర్తవ్యములేమిటి?


ఇట్లు, చిన్నపనుల రన్నర్




డియర్ రన్నర్: మీ బాధ నాకు అర్ధమవు తున్నది, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి కానీ ఎంత కాలం. మీరు కొంతకాలం ఈ విధముగా కొనసాగించండి. వారానికి రెండు రోజులు మీరు తెస్తానని చెప్పండి. మీ లాగే మిగతా వాళ్ళు కూడా పని పంచు కునే ప్రయత్నం చేయండి. కానీ సహాయము చేయటం మాన కండి.
మీ పెద్దవాళ్ళను  (grandparents )  గుర్తుకు తెచ్చుకోండి, వారికి కూడా ఈ విధముగానే చిన్నపనులు పెద్దపనులు,  స్నేహితులో, పక్కిన్టివాళ్ళో , దారే పోయేవాళ్ళో ఎవరో అవసరము అయినప్పుడు సహాయము చేస్తూనే ఉంటారు.
చాలా మంది వృద్ధులు భోజనానికి ఇబ్బంది పడుతూ వుంటారు -- మీ ఆఫీసులో స్నేహితుని లాగా, బయటకు వెళ్ళటానికి వీలు లేక, సత్తువ లేక. 
మీ ఊళ్ళో ఉన్న "office on aging " ని కనుక్కుంటే వాళ్ళు మీ స్నేహితుని జీవితం కొంచెము సులువయ్యేట్లు చూడ గలుగుతారు. 
సమస్యని పరిష్కరించటానికి ప్రయత్నించి నందుకు ధన్యవాదములు. 


చివరిమాట: మీరేమంటారు ?


మీరు US లో ఉంటే సీనియర్స్ కి సహాయము చెయ్యటానికి State, County, Township and city లెవెల్ లో చాలా సంస్థలు ఉన్నాయి. మీకు నిస్సహాయతతో ఎవరన్నా కనపడితే దయచేసి ఆ సంస్థల తోటి కలపండి. సీనియర్ సర్వీసెస్ అని గూగుల్ చేస్తే నంబర్లు దొరుకుతాయి. ఉదా: Naperville Township కి 'Dial A Ride' ప్రోగ్రాం ఉంది. అల్లాగే 'Meals on Wheels' ప్రోగ్రాం. 'Food Pantry' ప్రోగ్రాం.

Friday, August 13, 2010

జీవిత చక్రం

ముందు మాట: ఈ కథకి మూలము హిందూ టెంపుల్ లో వాలంటీర్ గ చేయునప్పుడు తీరిక సమయములో చదివిన ఒక కథ. గుడి లో చదువుటచే  ఏదో వేదాంత  పుస్తకములోనిది అయి ఉండవచ్చును.  ఇందులో (నాకు గుర్తు లేక) పాత్రల పేర్లు, కొంత కథా కల్పితాలు. కానీ భావము మాత్రము మార్చలేదు. 

ధనుంజయుడికి జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్ళిపోవుచుండెను. చేతులారా డబ్బులు సంపాయించు చుండెను.   ఎవ్వరూ తనకి ఉచితముగా ఇచ్చినవి కావు. ఈ మేడలు ఈ మిద్దెలు ఇవన్నీ తన తెలివితేటలతో, తన స్వశక్తి తో, తన ఊహా సంపత్తు తో, కష్టపడి పనిచేయుట వలన వచ్చినవి కనుక తను ఇంకొకళ్ళకి ఉచితముగా దాన ధర్మాలు చెయ్యవలసిన అవుసరము లేదు అని నిర్ణయించు కొనెను. తన తెలివితేటలు ఊహాసంపత్తీ ఎటుల తనకు వచ్చెనో గుర్తించలేక పోయెను. బాలప్రాయమునుండీ సాకిన తలి దండ్రులు, బంధువులు,తనతో ఆటలాడిన మిత్రులు, చదువులు నేర్పిన అధ్యాపకులు, తనకు సౌకర్యములు ఇచ్చుచున్న భార్యా పిల్లలు, వీరెవరు తనకు కానరాలేదు.  

వయసు పెరిగిన కొలదీ తను సంపాయించు  ధనమూ దానితో సంఘము లో గౌరవము పెరుగుతూ వచ్చెను. తనమీద తన తెలివితేటలమీద తనకి పెద్ద నమ్మకము గర్వమూ పెరిగెను. ఇంటిలోనూ బయట ఒకటే పద్ధతి లో ఆలోచన. నా అంత తెలివితేటల వాళ్ళు మీరు కాదు. నేను చెప్పినదే వేదము కనక  మీరు నేను చెప్పినపని చేయవలయును. భార్యా పిల్లలకు, సేవకులకు అందరికీ యజమాని అనిన భయము. 

కాలక్రమేణా పిల్లలు వారి త్రోవన వాళ్ళు వెళ్ళి పోయిరి. భార్య పరమపదించెను. ఒంటరి వాడయ్యెను.  పెద్ద ఇంటిలో  ఉండుట ఖర్చు పని అని ఒక చిన్న ఇంటిలోనికి మారి తన మాటలను శిరసావహించు ఒక సేవకుని మాత్రమే ఉంచుకొనెను. ఆ సేవకుడికి అయ్యగారు చెప్పు పనులన్నియు చేయుట కష్టముగా ఉండెను. పది పనులు చెప్పి అన్నియు అప్పుడే కావలయుననిన జరగని పని. ఆ సేవకుడు కూడా అన్నిటిలోనూ నిష్ణాతుడు కాకపోవటముచే తప్పులు చేయు చుండెను. దానితో యజమానికి కోపము వచ్చుచుండెను. తన ఒక్కడి కొరకు పదిమంది సేవకులను పెట్టుకొనుట ఇష్టము లేదు.ఈ సేవకుని మాన్పించి ఇంకొక సేవకుని పెట్టుకొనుటకు మనసొప్పుట లేదు. కొత్త వానికి మరల తనకు కావలసినవిధముగ పనులు నేర్పుట కష్టము కదా. 

ఒకరోజున మితిమీరిన కోపము వచ్చుటచే సేవకుని పిలిచి చెక్కమీద "I am an Idiot"  అను బోర్డు చేక్కించుకు రమ్మని పంపెను. బోర్డు తెచ్చిన వెంటనే దానికి రెండు వేపుల తాడు కట్టి హారముగా మెడలో వేసుకొనమని చెప్పెను. రోజూ పనికి వచ్చినప్పటి నుండీ వెళ్ళు దాకా ఆ హారమును వేసుకొని పనిచేయు మని చెప్పెను. దీనివలన తన పని సవ్యముగ జరగని యడల తన మనస్థాపము తగ్గునని భావించెను.  

ఈ విధముగా యజమాని సేవకుడు రోజులు గడుపు చుంటిరి. హఠాటాత్తుగా ఒక రోజున యజమాని అస్వస్థకు లోనుకాగా తన కాళ్ళు స్వాధీనము తప్పెను. ఎంత మందికి  చూపిననూ పరిస్థితి మెరుగు పడలేదు. కాల కృత్యములకు కూడా సేవకుని సహాయము కావలసి వచ్చెను. సేవకుడు కూడా నమ్రతగా రోజూ తన హారము వేసుకుని పని చేయు చుండెను. 

యజమానికి ఒక రోజు పట్టరాని కోపము వచ్చి సేవకుని, హారము లోని పదములు చదవ మనెను. సేవకునికి చదువు రాక పోవుటచే తను చదివి దాని అర్ధము చెప్పెను. వెంటనే సేవకుడు తన హారమును తీసి యజమాని మెడలో వేసెను. సేవకుడు తను ఇంక పనిచేయనని వెళ్ళి పోవుచుండగా జీతము రెట్టింపు చేసి తన దగ్గరే ఉండమని బతిమాలెను. రోజూ సేవకుడు వచ్చి హారమును యజమాని మెడలో వేసి తను వెళ్లి పోవు చున్నపుడు తీసివేయుచు యజమాని చనిపోవు వరకూ పనిచేసేను.

 చివరిమాట: జీవిత కాల చక్రములో బండ్లు ఓడలూ ఓడలు బండ్లు గా మారవచ్చును. అందువలన జీవన విధానము లో మానవత్వము చూపక జీవించిన, అనువుగాని సమయమున భంగపాటు తో జీవించ వలసి వచ్చును.   

Tuesday, August 3, 2010

లాండ్రోమేట్లో కుస్తీ

ముందు మాట: లాండ్రోమేట్ అంటే తెలుగులో చెప్పాలంటే  సామూహిక బట్టలుతికే చోటు అని చెప్పొచ్చు లేకపోతే చాకిరేవు అని కూడా అనవచ్చు. 
ఈ క్రింది సంభాషణలు అమెరికాలో ప్రతీ ఇంటిలో ఎప్పుడో  ఒకప్పుడు రాక మానవు (చాకలి మెషీన్లు  ఉన్నా లేకపోయినా ).

" విడిచిన బట్టలు చాలా ఉన్నాయి."
"మన వాషింగ్ మెషీన్ పనిచెయ్యక  పోతే  నైకోర్ వాణ్ని పిలు." బాగు చెయ్యటానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. పిలిస్తే వచ్చి బాగు చేస్తాడు.
"కుదరక వాషింగ్ చెయ్యలేదు. ఒక రోజంతా పట్టేటట్లా ఉంది,  వాషింగ్ కి  drying కి. లాండ్రోమేట్ కి వెళ్తే ఒక గంటలో అవుతుంది"

ఒకప్పుడు అంటే ఇరవై ఏళ్ళ క్రిందట వరకూ రెండు వారాల కొకసారి వెళ్లి బట్టలు ఉతుక్కుని  వచ్చేవాళ్ళం. ఆ రోజు స్పెషల్,  వాషింగ్ అయిన తరువాత అటునుంచి అటే  రెస్టారెంట్ కి  వెళ్లి బ్రేక్ ఫాస్ట్  చేసేవాళ్ళము. ఫామిలీతోటి ఎక్కువసేపు గడపచ్చని,   కావాలని ఇంట్లో చాకలి మేషీనులు కొనలేదు.  తరువాత ఇంటావిడా పిల్లలు నా మీద తిరగపడటం తోటి ఉతుక్కోవటం ఇంట్లోనే పెట్టుకున్నాము. పాత రోజులు గుర్తుకు వస్తే కొంచం బాధగా ఉంటుంది.

"సరే రేపు పొద్దున్న ఎనిమిది గంటలకు  వెళ్దాము "
"మనింటి దగ్గర లాండ్రోమేట్ మూసేశారు. క్రిందటి సంవత్సరం మీరు వెళ్ళిన చోటుకి వెళ్దాము." క్రిందటిసంవత్సరం మా డ్రయర్ పాడయితే తడి గుడ్డ లన్నీ మోసుకెళ్ళి ఆరబెట్టుకు వచ్చాను.

మర్నాడు చాకలి మూటలు కట్టుకుని కారు లో బయల్దేరాము చాకలి రేవు(లాండ్రోమేట్) కి. బట్టల మూటలు,  ఆవిడని చాకిరేవు ఎదురుకుండా దించి కారు పార్క్ చెయ్య టానికి వెళ్ళాను.వచ్చి చూసేసరికి మెషిన్ లో బట్టలు వేస్తోంది. రుద్రం మోహము లో కనపడుతోంది. మీరు గమనించారో లేదో ప్రళయం ముందు చాలా ప్రశాంతము గా ఉంటుంది. ఒక గంటసేపు నాకు కోపము తెప్పించవోకు నాయనా,  నన్ను నలుగురిలో నవ్వులపాలు చెయ్యకు తండ్రీ అని ప్రార్ధిస్తూ నాకొచ్చిన  మంత్రాలన్నీ చదివేశాను.  

"పార్కింగ్ కి ఇంతసేపు ఎందుకు అయ్యింది?"
"కారు సూర్యుడి ఎదురు లేకుండా  పార్కు చేశాను అందుకు ఆలశ్యమయ్యింది"
"ఇక్కడ డబ్బులు తీసుకోరట నాకెందుకు చెప్పలేదు" ఎదురు కుండా ఎటియం కార్డు లాంటిది కనపడు తోంది.
"అయ్యో నేను చెప్పటం మర్చేపోయాను "
"కార్డు లో డబ్బులు లోడ్ చేశాను, ఈ సోపు వేసి రెండు ఫ్రంట్ లోడర్సు స్టార్ట్ చెయ్యండి".  ఇక్కడ చాకలి మెషీన్లు ఫ్రంట్ లోడర్సు అని టాప్ లోడర్సు అనీ రెండు రకాలు. టాప్ లోడర్సు లో సామాన్యం గ ఒక మూటే పడుతుంది. ఫ్రంట్ లోడర్సు లో ఎక్కువ లోడ్సు వెయ్య వచ్చు. కార్డ్ slot  లో పెట్టి రెండు మూడు సార్లు ప్రయత్నించాను. స్టార్ట్ అవలేదు. నాకు ఈ కార్డులతో చాలా భయం. పెట్రోల్ బంకుల  దగ్గరనుంచీ వాటిని వాడాలి. ఎప్పుడూ వాటితో ప్రోబ్లెంసే. మొన్నే ఎవరో అమెరికాలో పెట్రోల్ బంకుల దగ్గర డెబిట్ కార్డులు వాడద్దని సలహా ఇచ్చారు. ఏమిటో ఎన్ని రకాల కార్డులో. 

"చేతకాకపోతే అటెండరు ని పిలవాలి" అటెండరు ని తీసుకు వచ్చాను. ఠకా  మని రెండు మెషీన్లు స్టార్ట్ అయినాయి. కార్డు పెట్టి గబుక్కున తీసేయ్యాలాట. రెండు అయిదు డాలర్లు లాగేసుకుంది.  ఇంత డబ్బులు ఎప్పుడూ పెట్టలేదు. పాత కాలం లో క్వార్టర్సు తోటి సరిపోయేది. మెషీన్లు గుడ్డల మీద సోపు నీళ్ళు పోసుకుంటూ  తిరుగుతుంటే చూస్తున్నాను.

"ఏమిటి ఇంత డబ్బయింది?"
"ధరలు పెరిగి ఉంటాయి" అంటూ ఉండగానే  దాని మీద ఫయివు లోడరు  అని బోర్డు గమనించాను. అప్పుడే ఆవిడా గమనించింది.
"అయిదు లోడ్ల దానిలో రెండు లోడ్లు వేసాము. మీకు తెలియదా ఇక్కడ మెషీన్లు గురించి?"
"తెలియదు"
"మరి ఎందుకు తీసుకు వచ్చారు ఇక్కడికి?"
"అంటే నేను ముందరగా వెళ్లి అన్నీ చూసి రావాలా?"
"క్రిందటి సంవత్సరము వచ్చారుగా ఇక్కడికి!" నాకు మాట పెగలటల్లేదు.  క్రిందటి సంవత్సరము వచ్చినది వాస్తవమే . కానీ ఆనాటి  పరిస్థితి వేరు. మా ఆవిడ పక్కనలేదు. ఇది అమెరికా,   చేత కాని తనము చెబితే పక్కవాళ్ళు చేసి పెట్టారు.  పరిస్థుతులు కొంచం  వేడెక్కే టట్లు ఉన్నాయని గ్రహించి, సరే ఇక్కడ ఎమున్నయ్యో చూస్తానని పక్క వరుస లోకి వెళ్ళాను. అక్కడ నాలుగు లోడర్లవి ఉన్నాయి. వాడటానికి ధర ఇంకా తక్కువ. పక్కవరుసలో  ఆరు లోడర్లవి ఉన్నాయి. ఇంకొకవరసలో ఒక మూటకి సరిపోయేవి టాప్ లోడర్సు  వున్నాయి. పక్కన కష్టమర్సు కి ఫ్రీ సోప్  అని కూడా వ్రాసి వుంది. కూర్చోటానికి కుర్చీలు, చదువుకోటానికి పత్రికలూ, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మయం. చూస్తుంటే ప్రపంచములో ఆడవాళ్లే ఎక్కువగా ఉతుకుతారల్లె ఉంది. కొందరయితే వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా తీసి  ఉతుకు తున్నారల్లె  ఉంది. కొందరికి కన్నుల పండువ గాను కొందరికి "రామ రామ" గానూ ఉండవచ్చు. 

"వాషింగ్ అయినది బట్టలు డ్రయర్  లో వెయ్యాలి" తడి బట్టలన్నీ తీసి రెండు డ్రయర్ ల  లో వేసాము. మళ్ళా కార్డుల   తోటి తంతు. ఈ తడవ మెషీను స్టార్ట్ అయ్యింది కానీ దాని  మీద పది అంకె వచ్చేసరికి పది డాలర్లు లాగే సుకుందేమోనని భయపడ్డాము. మళ్ళా అటెండరు . చివరకి తెలిసింది ఆ పది డ్రయర్ తిరిగే నిమిషాలుట. మెషీన్లు  తిరుగుతుంటే ఈ తడవ ఆవిడ స్వయానా లాండ్రోమేట్ చూడటానికి బయల్దేరింది.
"సీనియర్స్ కి ట్వంటీ పర్సంట్ డిస్కౌంట్ ట. అక్కడ నోటీసు ఉంది చూసిరండి" అంతే చూడటమే కాదు ఎన్రోల్ అయి వచ్చాను. అప్పుడప్పుడు ఫ్రీ వాషింగ్ కూడాట. ఇంక నేను రెండు వారాల కొకసారి లాండ్రోమేట్ కి రావాలని నిర్ణయించు కున్నాను. 
"డ్రయర్ అయ్యింది బట్టలు తీయండి" బట్టలు తీయటము, మూటలు కట్టటము, కార్లో పెట్టటము, ఇంటికి చేరటము తర్వాతా ఇంట్లోకి చేర్చటము అన్నీ అయినాయి. గంటలో పని అయిపోయిందని సంతోషం గ ఉన్నాను.
"నేను ఇంకా లాండ్రోమేట్ కి రాను" నా గుండెల్లో రాయి పడింది.
"ఎందుకని"
"బట్టలు మూట కట్టటము, చేరవేయ్యటము, మళ్ళా తీసుకువచ్చి ఇంట్లో చేరవేయ్యటము ఇంక నా వల్ల కాదు"
"పోనీ నా బట్టలు తీసుకువెళ్ళి ఉతుక్కుంటాలే, నీకు కొద్దిగానన్నా శ్రమ తప్పుతుంది"
"పోనీ ఆపని చెయ్యండి"

చివరి మాట: నాకు ఎక్కడలేని ఆనందముగా ఉంది పైకి మాత్రం గంభీరం గ ఉన్నాను లేకపోతే అసలుకే మోసం వస్తుంది. హాయిగా ఒంటరిగా లాండ్రోమేట్ కి వెళ్ళవచ్చు, సీనియర్ డిస్కౌంట్లు, ఫ్రీ సోప్. పక్కనున్న డునట్ షాప్  లో సీనియర్ రోజు ఎప్పుడో కనుక్కుంటే,  డునట్ తోటి ఫ్రీ కాఫీ, ఎయిర్ కండిషన్  లాండ్రోమేట్,  పక్కన భార్య లేకుండా ఒక గంట. హా ఇట్ ఈస్  హెవన్ . 

Friday, January 15, 2010

5. ముకుంద ప్రియ ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు






నా చిన్న కథ డిసెంబర్ 1998 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
కథ విధంగా మొదలవుతుంది....
ముకుందం MBA ఇంక పెళ్లి చేసుకుందామని తీర్మానించుకున్నాడు. జీవితంలో న్నీ నుకున్నట్లు జరుగుతున్నాయి. చదువు అయిపొయింది. చదువుతున్నప్పుడే ఉద్యోగం వచ్చింది. తనకోసం కంపెనీలు గద్దల్లా తన్నుకుంటూ ఉంటే ఆశ్చర్య మేసింది.తను ఇంత గొప్ప వాడినని ఇంతవరకు తెలిసికోలేదు.
....ఇక మీరు క్లిక్ చేసి చదవండి.
మీరు చదివేటప్పుడు, టూల్ బార్ మీద ఉన్న view, దానినుంచి వచ్చే zoom, zoomin, zoomout ఉపయోగించండి. తేలికగా చదవచ్చు.